: కేజ్రీవాల్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు: ఎన్నికల కోడ్ ను అతిక్రమించారని ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అరవింద్ కేజ్రీవాల్ అతిక్రమించారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. మొన్నటికి మొన్న బీజేపీ సీఎం అభ్యర్థి జగదీశ్ ముఖీనేనంటూ ఆప్ నేతలు వాల్ పోస్టర్లు విడుదల చేసి సంచలనం సృష్టించారు. దీనిపైనా బీజేపీ, కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ ను అతిక్రమించారంటూ ఆయనపై బీజేపీ ఏకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ పిర్యాదును పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం, ఆధారాలు లభ్యమైతే కేజ్రీవాల్ పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తుంది.