: కోడి పందేల్లో నందమూరి బాలకృష్ణ...నిమ్మకూరులో జోరుగా సంక్రాంతి సంబరాలు
నందమూరి పుట్టిల్లు నిమ్మకూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నందమూరి నట వారసుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిమ్మకూరు సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటుండటంతో గ్రామంలో సంబరాల జోరు కొనసాగుతోంది. నిన్న కుటుంబంతో కలిసి నిమ్మకూరు చేరుకున్న బాలయ్య, కొద్దిసేపటి క్రితం నేరుగా కోడి పందేల్లో పాల్గొన్నారు. ఎడ్ల బండిపై వచ్చిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. పూల మాలలతో బాలయ్యను ముంచేశారు. ఎడ్ల బండిపై నుంచి దిగిన బాలయ్య పోట్లాటకు సిద్ధంగా ఉన్న కోడి పుంజులను చేతుల్లోకి తీసుకుని మురిపెంగా వాటి మేను తడిమారు. బాలయ్యే అక్కడ ప్రత్యక్షమై కోడిపుంజులను చేతబట్టడంతో పందెంరాయుళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కొద్దిసేపు ప్రసంగించిన బాలయ్య అక్కడి నుంచి కదిలి ముందుకెళ్లారు.