: మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తో 'చార్లీ హెబ్డో' సంచిక... నిమిషాల్లో ముప్పై లక్షల కాపీల అమ్మకం
ఫ్రాన్స్ వ్యంగ్య వారపత్రిక 'చార్లీ హెబ్డో' తాజా సంచిక ప్రతులు మార్కెట్లోకి విడుదలైన నిమిషాల్లో అమ్ముడయ్యాయి. ఉగ్రవాద దాడులు జరిగినా, వాటిని లక్ష్య పెట్టక తాజా సంచికలోనూ ఏకంగా మహమ్మద్ ప్రవక్త చిత్రాన్నే కవర్ పేజీపై ముద్రించారు. తలపాగా, గడ్డంతో ఉన్న క్యారికేచర్ 'అయామ్ చార్లీ' అనే స్లోగన్ను పట్టుకున్న డిజైన్తో రూపొందించిన కవర్ పేజీతో కూడిన ఆ పత్రికను ఈ-బే వెబ్ సైట్లో పెట్టారు. దాంతో ఆ సంచిక కొనేందుకు పాఠకులు ఆన్ లైన్లో ఎగబడ్డారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అన్ని కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సాధారణంగా ముద్రించే 60 వేల కాపీలను ఉగ్రదాడుల తరువాత 30 లక్షలకు పెంచగా, అవన్నీ అమ్ముడుపోయాయి. దీంతో మరో 50 లక్షల కాపీలను ముద్రిస్తామని చార్లీ హెబ్డో యాజమాన్యం ప్రకటించింది.