: అందమైన స్త్రీలనే రాజకీయ నేతలుగా ఎన్నుకోండి... కత్రినా రాష్ట్రపతి కావాలి: మార్కండేయ ఖట్జూ
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలుగా అందమైన మహిళలనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. "మన నేతలంతా ఏదో చేస్తామని చెప్తారు. కానీ, ఏమీ చేయరు. ఎన్నికల్లో మనం ఎవరినో ఒకరిని ఎన్నుకోక తప్పదు. అదే అందమైన మహిళలను నేతలుగా ఎన్నుకుంటే... కనీసం వారి అందమైన ముఖాలనైనా చూస్తూ సంతోషంగా గడపవచ్చు. లేకపోతే, మనం ఓటేసినా మనకు వచ్చేదేమీ ఉండదు" అని అన్నారు. అందమైన నేతలు ఉంటే దేశ ఆర్థిక స్థితి మెరుగు పడుతుందని ఖట్జూ అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న క్రొయేషియా కొత్త ప్రెసిడెంట్ గా కొలిండా గ్రాబార్-కిటరోవిక్ ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన దేశ తదుపరి రాష్ట్రపతిగా బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ ఎన్నికవ్వాలని అభిలషించారు. ప్రతి పదవిలోనూ అందమైన మహిళలే ఉండాలని అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కంటే సాధ్వి నిరంజన్ జ్యోతి అందంగా ఉంటారని కట్జూ తెలిపారు. అంతేకాదు, స్మృతి ఇరానీ కాస్త లావు తగ్గాలని కూడా సూచించారు. మీ కెరియర్ లో అందమైన మహిళలను మిస్ అయ్యారా? అన్న ప్రశ్నకు ఖట్జూ బదులిస్తూ... సుప్రీంకోర్టులో, అలహాబాద్, మద్రాస్, ఢిల్లీ హైకోర్టుల్లో తాను పని చేసినప్పుడు ఎంతో మంది అందమైన మహిళా లాయర్లు కోర్టులో ఉండేవారని రక్తి కట్టించారు. మరో విషయం ఏంటంటే... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ఏమాత్రం అందగత్తె కాదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రధాని పదవికి పూర్తి అర్హురాలిగా దివంగత నటి మధుబాలను కట్జూ పేర్కొన్నారు. కట్జూ వ్యాఖ్యలు ఏ రేంజ్ లో దుమారం రేపుతాయో వేచి చూడాలి.