: పెను విషాదాన్ని మరచి... ముప్పై లక్షల కాపీలతో మార్కెట్లోకి 'చార్లీ హెబ్డో’
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా వెలువడుతున్న ప్రముఖ వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ తదుపరి సంచిక 30 లక్షల కాపీలతో మార్కెట్లోకి రానుంది. ఇటీవల ఈ పత్రిక కార్యాలయంలో ఉగ్రవాద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. పెను విషాదాన్ని మరచి తలెత్తుకొని మరోసారి ప్రజల ముందుకు పత్రికను తీసుకువస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. ప్రజాభిమానం ఉన్నంతకాలం పత్రికా స్వేచ్చకు మరణం ఉండదని వ్యాఖ్యానించింది. కాగా, తదుపరి సంచిక కవర్ పేజీ తలపాగా, గడ్డంతో ఉన్న క్యారికేచర్ ‘అయామ్ చార్లీ’ అనే స్లోగన్ను పట్టుకున్న డిజైన్తో రూపొందింది. ఈ కవర్ పేజీని పత్రిక సామాజిక వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ పత్రిక సాధారణంగా 60 వేల కాపీలు మాత్రమే ముద్రిస్తుంది. ఉగ్రదాడి తరువాత పత్రికకు పెరిగిన డిమాండును దృష్టిలో ఉంచుకుని 30 లక్షల కాపీలను ముద్రించాలని యాజమాన్యం నిర్ణయించింది.