: వరల్డ్ కప్ తొలి మ్యాచ్ వీక్షకులు నూరు కోట్ల మంది
ప్రపంచ క్రికెట్ చరిత్రలో త్వరలో జరగనున్న వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 15న అడిలైడ్ లో జరగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ను వివిధ మాధ్యమాల ద్వారా సుమారు వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందని వరల్డ్ కప్ నిర్వాహకులు తెలిపారు. కాగా, 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ లో తలపడిన ఈ రెండు జట్ల మ్యాచ్‌ను 98 కోట్ల 80 లక్షల మంది తిలకించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికులు వీక్షించిన మ్యాచ్ గా రికార్డు దాని పేరిటే ఉంది. ఈసారి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు ఆసక్తి చూపించడంతో టిక్కెట్లు ఆరు నెలల కిందటే అమ్ముడయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన ఏ టోర్నీలోనూ ఏ మ్యాచ్ పై కూడా ఇంత ఆసక్తి కనబడలేదని ప్రపంచకప్ నిర్వహణాధికారి తెలిపారు. కాగా, ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ తలపడిన ఐదు మ్యాచుల్లోనూ టీమిండియానే పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.