: ఆనాడు 'ఈనాడు' పేపర్లను కూడా దగ్ధం చేసిన కేసీఆర్... ఇప్పుడు మాటెలా మారుస్తారు?: గోనె
రామోజీ ఫిలిం సిటీని నాగళ్లతో దున్నిస్తానని తాను ఏనాడూ అనలేదని టీఎస్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని కేసీఆర్ అన్న మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిలిం సిటీని దున్నే మొదటి నాగలి తనదే అని కూడా కేసీఆర్ అన్నారని... దానికి సంబంధించిన క్లిప్పింగులు కూడా తన వద్ద ఉన్నాయని మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలి రోజుల్లో కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తామని అన్నారని... అంతేకాకుండా, అదే సభలో ఈనాడు పత్రిక సంచికలను కూడా తగలబెట్టారని గోనె ప్రకాష్ రావు తెలిపారు. రామోజీ ఫిలిం సిటీని కేసీఆర్ మెచ్చుకోవడంలో తప్పులేదని... తాను ఆ మాటే అనలేదని అబద్ధాలు చెప్పడం మాత్రం ఘోరమని అన్నారు.