: ఆధ్యాత్మిక గురు 'ఆశారాం బాపు' రేప్ కేసులో సాక్షి దారుణ హత్య... కాల్చి చంపారు
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపు మరో కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక సాక్షిగా ఉన్న 35 ఏళ్ల అఖిల్ గుప్తా దారుణ హత్యకు గురయ్యారు. ముజఫర్ నగర్ లోని జన్సత్ రోడ్డు పై గుప్తాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం సంభవించింది. కాల్పులకు గురైన గుప్తాను హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆశారాం బాపుకు గుప్తా అంతరంగికుడే కాకుండా, ఆయన వ్యక్తిగత వంటవాడు కూడా. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ప్రస్తుతం ఆశారాం బాపు జైలులో గడుపుతున్నాడు. సూరత్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమపై ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ్ సాయి మానభంగం చేశారని గతంలో ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి గుప్తా స్టేట్ మెంటును గాంధీనగర్ కోర్టు రికార్డు చేసింది. విచారణ పూర్తి కాకుండానే కీలక సాక్షి హతం కావడంతో, కేసు ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.