: రండి... కదలి రండి: సింగిల్ టేక్ లో హరీశ్ డైలాగ్ డెలివరీ!
అదేంటీ, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు నటుడిగా ఎప్పుడు మారారనుకుంటున్నారా?... నిన్ననే. వేదిక మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం. పూర్తి స్థాయి నటుడిగా కాదులెండి. తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’పై అదే పేరుతో రూపొందుతున్న లఘు చిత్రంలో హరీశ్ రావు నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ సందర్భంగా సినీ నటులకు ఏమాత్రం తీసిపోని రీతిలో డైలాగులు చెప్పిన హరీశ్ రావు రియల్ హీరోలానే మెరిశారు. తలకు పాగా చుట్టి, చేత పార పట్టి... మిషన్ కాకతీయకు కదలిరండంటూ పిలుపునిచ్చిన హరీశ్ రావు సింగిల్ షాట్ లో డైలాగ్ చెప్పేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘పూడిక తీస్తే చెరువుకు ఆరోగ్యం. ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతుకు సౌభాగ్యం. చేయి చేయి కలిపి రండి... వట్టిపోయిన చెరువులను పునరుద్ధరించుకుందాం’’ అంటూ హరీశ్ చెప్పిన డైలాగును బాల కిషన్ ఫస్ట్ టేక్ కే ఓకే చేశారు.