: సెలబ్రిటీ అయితే.. ఆయుష్షు తగ్గుతున్నట్లే!
సెలబ్రిటీ కావాలని తపన పడని వారుండరు. అందాలు వెల్లువెత్తే సినీ ప్రపంచంలోనో, గాయకులుగానో, క్రీడాకారులుగానో ఏదో ఒకరీతిగా సెలబ్రిటీలు కావాలని అనుకుంటారు. అయితే.. ఈ ప్రఖ్యాతికల వారుగా తయారు కావడం అనేది.. ఆయు:ప్రమాణాన్ని తగ్గిస్తుందిట. ఇలాంటి వివరాలను వెల్లడించే ఓ అధ్యయనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
రిచర్డ్ ఎప్స్టీన్, కేథరీన్ ఎప్స్టీన్ల సుదీర్ఘమైన అధ్యయనంలో వెయ్యి మరణాలను ప్రస్తావించారు. మరణించినవారు ఆడా మగా, వయస్సు, వృత్తి, మరణానికి గల కారణం అనే కోణాల్లో అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతోందని సిడ్నీలోని కింగ్హార్న్ క్యాన్సర్ సెంటర్ వారు తేల్చారు. వృత్తులను నాలుగు కేటగిరీలుగా విభజించి అధ్యయనం చేశారు.
చిన్న వయసులోనే చనిపోతున్న వారిలో.. క్రీడాకారులు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. బాగా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగి చనిపోతున్న వారిలో.. లెక్చరర్లు, వ్యాపారులు, మిలిటరీ ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు.