: పాఠశాలల్లో లైంగిక విద్యా బోధన అవసరం లేదు: దీనానాథ్ బాత్రా
దేశంలోని పాఠశాలల్లో లైంగిక విద్యా బోధన ఎంతమాత్రం అవససరం లేదని రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, శిక్షా బచావ్ ఆందోళన్ సమితి, శిక్షా సమితి ఉత్తాన్ న్యాస్ నిర్వాహకుడు దీనానాథ్ బాత్రా అన్నారు. ‘‘పాఠశాలల్లో లైంగిక విద్యా బోధన ఎంతమాత్రం అవసరం లేదు. పిల్లలకు 19 ఏళ్ల వయసు వచ్చేదాకా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి విద్యా బోధన అవసరం లేదు. వివాహం చేసుకునే సమయంలో వారే లైంగిక విద్యను స్వతహాగా నేర్చుకుంటారు. పిల్లల్లోని అభ్యసన శక్తిని ఇతర అంశాలపైకి మళ్లించడమే మంచిది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘ద సండే స్టాండర్డ్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా దీనానాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పెంగ్విన్ పబ్లిషర్స్ పుస్తకం ‘ద హిందూస్: యాన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ’ని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన ఆయన గతంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. దేశంలో కొనసాగుతున్న విద్యా విధానంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్క్స్, థామస్ మెకాలే విధానాలతోనే కొనసాగుతున్న దేశీయ విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు.