: జగన్ కలలు కంటున్నారు: మంత్రి నారాయణ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పగటి కలలు కంటున్నారని ఏపీ మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని అన్నారు. 30 వేల ఎకరాల భూమి రాజధాని నిర్మాణానికి అవసరం కాగా, అందులో 3,500 ఎకరాల భూమిని సేకరించామని ఆయన తెలిపారు. ఇంకా చాలా మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూమినిచ్చేందుకు ముందుకొస్తున్నారని ఆయన వెల్లడించారు. మూడేళ్లలో రాజధాని తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 30 ఏళ్లు ఏపీని పరిపాలిస్తానంటూ జగన్ పగటి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు.