: ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నందుకు ఒబామా ఎంతో ఉత్తేజంగా ఉన్నారు: జాన్ కెర్రీ
భారత్ కు మళ్లీ రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, ఇదొక గర్వకారణమని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. భారత ప్రధాని సొంత రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. మార్పు, సాధ్యం అనే పదాలకు గుజరాత్ పర్యాయపదంగా మారిందని... ఈ ఘనత మోదీదే అని పొగిడారు. ఉజ్వల గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ, ఆయన పైవిధంగా స్పందించారు. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడులపై స్పందిస్తూ, ఆ దేశ ప్రజల పక్షాన అమెరికా ఉంటుందని కెర్రీ చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉగ్రవాదం ఎన్నటికీ ప్రపంచ శాంతిని హరించలేదని అన్నారు. భారత్ ను రెండుసార్లు సందర్శించిన మొదటి సిట్టింగ్ ప్రెసిడెంట్ గా ఒబామా చరిత్రలో నిలిచిపోనున్నారని తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నందుకు... ఒబామా ఎంతో ఉత్తేజంగా ఉన్నారని చెప్పారు. భారత్, అమెరికాల మధ్య నెలకొన్న ఉన్నతమైన బంధం విలువను ఒబామా పర్యటనలు వెల్లడిస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు రెండు దేశాలు కలసి పనిచేయాలని జాన్ కెర్రీ పిలుపునిచ్చారు. భారత్ తో వాణిజ్య అనుబంధాలను మరింత దృఢం చేసుకోవడమే అమెరికా లక్ష్యమని తెలిపారు. రెండు దేశాలు కలసి చాలా చేయాల్సి ఉందని... అయితే, వేగంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.