: కరాచీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... కాలి బూడిదైన యాభైఏడు మంది
పాకిస్తాన్ లోని కరాచీ సమీపంలోని సూపర్ హైవేపై గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కరాచీ నుంచి షికార్ పూర్ వెళుతున్న బస్సును... ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. వెంటనే మంటలు అంటుకుని బస్సు, ట్యాంకర్ రెండూ బుగ్గి అయిపోయాయి. ఇప్పటి వరకు 57 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మృత దేహాలు బాగా కాలిపోయాయని, గుర్తు పట్టడానికి కూడా వీలుకావడం లేదని... కేవలం డీఎన్ఏ టెస్టు ద్వారా మాత్రమే మృతులను గుర్తించే అవకాశం ఉందని కరాచీలోని జిన్నా హాస్పిటల్ వైద్యుడు జమాలీ తెలిపారు. కనీసం ఆరు మంది చిన్నారుల మృత దేహాలు వారి తల్లుల మృతదేహాలకు అతుక్కుపోయాయని వెల్లడించారు. బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.