: నాయినికి చేదు అనుభవం
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన హోం మంత్రి... యాజమాన్యం, హెచ్ఎమ్ఎస్ కార్మిక సంఘానికి మద్యవర్తిత్వం వహించారు. రెండు నెలలుగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని హోం మంత్రిని కార్మికులు కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన హోం మంత్రి సమావేశం మధ్యలోనే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మంత్రి ప్రయత్నాన్ని పసిగట్టిన కార్మికులు ఆయనను ఘొరావ్ చేశారు. ఆయనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా ఆయనను అడ్డుకునేందుకు ఒక్కసారిగా తోసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని హోం మంత్రిని కారులో అక్కడి నుంచి పంపేశారు. తమకు అండగా నిలుస్తానన్న హోం మంత్రి, చర్చల మధ్యలోనే ఎలా వెళ్లిపోతారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.