: షెడ్యూలు ప్రకారమే అంగారకుడిపైకి భారతయాత్ర
ఒకవైపు 2014లోనే తోకచుక్క ఒకటి అంగారక గ్రహాన్ని తాకుతుందనే భయాలు వినిపిస్తుండగా, ఈ ఏడాది నవంబరులో రూ.450 కోట్ల వ్యయంతో అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించాలనుకుంటున్న భారత ప్రాజెక్టు షెడ్యూలు ప్రకారమే నడుస్తుందని ఇస్రో అధికారులు వెల్లడిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సైడిరగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ నుంచి రాబ్ మెక్‌నాట్.. జనవరి 3న సి 2013 ఏ1 తోకచుక్కను గుర్తించారు. ఇది అక్టోబరులో అంగారక గ్రహాన్ని ఢీకొంటుందని అంచనా వేస్తున్నారు. నాసా లెక్కల ప్రకారం తోకచుక్క మార్స్‌ను ఢీకొనే అవకాశం ఇదివరకు 8000లో 1 గా ఉండగా, తాజా లెక్కల ప్రకారం ఆ సంభావ్యత 120000 లలో 1గా మారింది.
తోకచుక్క వల్ల బెడద ఉండకపోవచ్చునని, దీని గురించి తమ శాస్త్రవేత్తలు ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని ఇస్రో చీఫ్ రాధాకృష్ణన్ అంటున్నారు. ఇస్రో మార్స్ మీదకు పంపుతున్న ఉపగ్రహం అక్కడి జీవ పదార్థం, వాతావరణం, ఖగోళ అంశాలు మీద దృష్టి పెడుతుంది. ఈ ఉపగ్రహాన్ని కూడా శ్రీహరికోటనుంచే ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం పూర్తయితే గనుక.. అంగారక గ్రహంపై పరిశోధనలకు ఉపగ్రహం ప్రయోగించిన ఆరో దేశం భారత్ అవుతుంది. ఇదివరలో అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా ఈ ఘనత సాధించాయి.