: ఖాళీ వ్యాన్ ను చూసి దొంగలు తెల్లమొహం వేశారు!
రాజస్థాన్ లోని జైపూర్లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారే భారీగా నగదు చోరీ చేద్దామని భావించిన ఐదుగురు దొంగలు ఉత్తచేతులతో వెనుదిరిగారు. వివరాల్లోకెళితే... నగరంలోని పల్లవ్ పురంలో యాక్సిస్ బ్యాంకు వెలుపలే అనుబంధంగా ఏటీఎం ఉంది. దాంట్లో క్యాష్ పెట్టేందుకు మెయిన్ బ్రాంచ్ నుంచి రోజూ వ్యాన్ వస్తూ ఉండడాన్ని ఈ దొంగల ముఠా గుర్తించింది. ఆ వ్యాన్ ను దోచుకుంటే తాము సెటిల్ అవ్వొచ్చని వారు భావించారు. ఓ రోజు వ్యాన్ ఏటీఏం వద్దకు రాగా, సిబ్బంది క్యాష్ ను మెషీన్ లో పెట్టేశారు. అదే సమయంలో దొంగలు కూడా వచ్చారు. వెంటనే వ్యాన్ డ్రైవర్ ను బెదిరించి, అతడిని కిందికి నెట్టేశారు. దీంతో, అప్రమత్తమైన బ్యాంకు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరపగా, దొంగలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీపక్ వర్మ అనే సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. ఓ దొంగ కూడా గాయపడగా, అనంతరం, ఆ వ్యాన్ తో దొంగల ముఠా పరారైంది. అయితే, తాము తీసుకెళ్లింది ఖాళీ వ్యాన్ ను అన్న సంగతి గ్రహించిన దొంగలు తెల్లమొహాలు వేశారు. దాంతో, ఆ వాహనాన్ని సర్దానా ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై నగర ఎస్ ఎస్పీ ఓంకార్ సింగ్ మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.