: నవాజ్ షరీఫ్ పార్టీని టార్గెట్ చేయండి... తీవ్రవాదులకు తాలిబాన్ చీఫ్ ఆదేశం
పెషావర్ లో సైనిక పాఠశాలపై దాడుల తరువాత మరణశిక్షపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను విచారించేందుకు మిలటరీ కోర్టులను ఏర్పాటు చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ తాలిబన్ తీవ్రవాద సంస్థ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ ని లక్ష్యంగా చేసుకోవాలని తీవ్రవాదులను తాలిబన్ అధినేత ముల్లా ఫజులుల్లా ఆదేశించాడు. "ఆ పార్టీ (పీఎంఎల్-ఎన్) నేతలపై తీవ్రంగా దాడులు చేయాలని ముజాహిదీన్ లను కోరుతున్నా. దాంతో వారు సరైన దారిలోకైనా వస్తారు లేదా నరకానికైనా వెళతారు" అని ఫజులుల్లా ఓ వీడియో సందేశంలో సూచించాడు. తమ మొదటి శత్రువు నవాజ్ షరీఫ్ అని, అందుకే ఇప్పుడు పీఎంఎల్-ఎన్ ను లక్ష్యంగా చేసుకోవాలని పాక్ లోని జిహాదీలందరికీ చెబుతున్నానన్నాడు.