: ఆ ఇద్దరి వేటకు ఐదు హెలికాప్టర్లు, ఎనభై ఎనిమిది వేల మంది పోలీసులు
పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి చేసిన ఇద్దరు తీవ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. అల్ ఖైదా సానుభూతిపరులైన ఆ ఇద్దరు ఉగ్రవాద సోదరులు ఓ కారును తస్కరించడం తెలిసిందే. దీంతో కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సెర్చ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆ కారును వెంబడించారు. పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేసిన ఉగ్రవాదులు ఓ ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ లో దాక్కున్నారు. అక్కడి సిబ్బందిని బందీలుగా చేసుకున్నట్టు సమాచారం. కాగా, ఫ్రాన్స్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో 88 వేల మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని ఐదు హెలికాప్టర్లు ఆకాశం నుంచి పహారా కాస్తున్నాయి. ఉగ్రవాదులు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైన వారని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.