: 'చార్లీ హెబ్డో'పై దాడిచేసిన వారిని హీరోలుగా కీర్తించిన ఇస్లామిక్ స్టేట్ రేడియో!
పారిస్ లోని 'చార్లీ హెబ్డో' పత్రిక కార్యాలయంపై దాడిచేసిన ఉగ్రవాదులను ఇస్లామిక్ స్టేట్ రేడియో హీరోలుగా కీర్తించింది. "ఫ్రెంచ్ మ్యాగజైన్ లో పనిచేస్తున్న 12 మంది జర్నలిస్టులను 'జిహాదిస్ట్ హీరోలు' చంపారు. పదిమందికి పైగా ఇతరులను గాయపరిచారు" అంటూ ఓ ప్రకటనలో అల్-బయాన్ రేడియో ప్రశంసల్లో ముంచెత్తింది. వాస్తవానికి ఉగ్రవాదుల కాల్పుల్లో 8 మంది జర్నలిస్టులే మరణించారు. మొత్తం 12 మంది చనిపోగా... మిగతా నలుగురిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఇప్పటికే పలుచోట్ల కాల్పులతో పారిస్ ప్రజలు భయాందోళనలో ఉండగా, పలువురు ఈ ఉగ్ర దాడులను ఖండిస్తున్నారు. మరోవైపు, చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడిలో చనిపోయిన వారికి నివాళిగా పారిస్ ఈఫిల్ టవర్ లైట్లను ఐదు నిమిషాల పాటు తీసివేసి స్థానికులు మౌనం పాటించారు.