: ధర తగ్గితే పన్నులు... పెరిగితే ప్రజలపై బాదుడు... ఎందుకీ 'పెట్రో' దుస్థితి?
ఐదేళ్ళ క్రితం 2009 ప్రారంభంలో క్రూడాయిల్ ధర 50 డాలర్ల వద్ద ఉన్నప్పుడు ఇండియాలోని బంకుల్లో లీటరు పెట్రోలు ధర రూ.40, డీజిల్ ధర రూ.30 వద్ద ఉన్నాయి. ఇప్పుడు కూడా ముడిచమురు ధర 50 డాలర్ల స్థాయిలో ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా దిగువనే ఉంది. కానీ పెట్రోల్ ధర మాత్రం రూ.67 వద్ద ఉంది. గత రెండు వారాల వ్యవధిలో ముడిచమురు ధర సుమారు 20 శాతం తగ్గినా ఇండియాలో పెట్రోలు రేటు తగ్గలేదు. గత వారంలో చమురు సంస్థలు లీటరుపై రూ.2 తగ్గిస్తే, ఆ వెంటనే పెట్రోలుపై పన్నును పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. అంతకుముందు ఒకసారి కూడా ధర తగ్గగానే, ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. గత సోమవారం కాంట్రాక్టు ప్రకారం ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న బ్యారెల్ క్రూడాయిల్ ధర 52 డాలర్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో, జనవరి 16న చమురు కంపెనీలు ధరలో కొంత వెసులుబాటు కల్పిస్తాయని తెలుస్తోంది. అయితే, ఈసారి కూడా పన్ను పెంపు వైపు మొగ్గుచూపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ధర తగ్గినపుడల్లా పన్నులు వడ్డిస్తూ, ధర పెరిగినపుడు దాన్ని వినియోగదారులపై రుద్దుతూ, ఎటుచూసినా ప్రజలపైనే భారం మోపుతున్న ఈ ప్రభుత్వాల వైఖరి ఎప్పటికి మారేనో!