: సంస్థాగతంగా బలపడేదెలా?: నేడు కర్నూలు జిల్లా పార్టీ నేతలతో జగన్ భేటీ!
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. గడచిన ఎన్నికల్లో పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రజలు జగన్ ను ప్రతిపక్ష నేతగా కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో పరాజయంపై సమగ్ర పరిశీలన చేసిన జగన్, పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపరిస్తే తప్పించి భవిష్యత్తు లేదని గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలంటే ముందు జిల్లాలపై దృష్టి సారించక తప్పదన్న భావనతో కొంతకాలం క్రితం జిల్లా సమీక్షలకు తెరతీసిన ఆయన నేడు, రేపు కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. నేడు కర్నూలు వెళ్లనున్న జగన్ పార్టీకి చెందిన జిల్లా నేతలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించనున్నారు. గడచిన ఎన్నికల్లో తన సొంత జిల్లా కడప కంటే కర్నూలు జిల్లాలోనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు మొత్తం 14 అసెంబ్లీల్లో 11 సీట్లను వైకాపా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ స్థితిగతులపై దృష్టి సారించనున్న ఆయన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారని పార్టీ వర్గాల సమాచారం.