: గులాబీ గూటికి నేడు వైసీపీ ఎమ్మెల్యే... వరంగల్ కు మారిన వేదిక!
వైకాపా నేత, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేడు కారెక్కనున్నారు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన తెలంగాణ సెంటిమెంటును కూడా అధిగమించి విజయం సాధంచగలిగారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఈ నేపథ్యంలో తాటి వెంకటేశ్వర్లు కూడా గులాబీ గూటికి చేరేందుకే నిర్ణయించుకున్నారు. తన రాజకీయ గురువు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సలహాతో గులాబీ తీర్థం పుచ్చకునేందుకు తాటి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన నేడు తుమ్మల, కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. అయితే ఈ చేరిక కార్యక్రమం హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు కూడా అక్కడే ఉండనున్న నేపథ్యంలో చేరిక వేడుక వేదిక కూడా వరంగల్ కే మారింది. దీంతో అశ్వారావుపేట నుంచి బయలుదేరనున్న కార్లు వరంగల్ దిశగా ప్రయాణం మొదలుపెట్టాయి.