: హమ్మయ్య... భారం దిగిపోయిందంటున్న సెంచరీ హీరో
మెల్బోర్న్ టెస్టుతో టెస్టు క్రికెట్ గడప తొక్కిన యువ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కెరీర్ తొలి టెస్టులో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే, సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ ఝుళిపించి శతకం నమోదు చేసుకున్నాడు. మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సెంచరీ చేయడం ఎంతో ఊరటనిచ్చిందన్నాడు. బ్యాటింగ్ ఎంతో సంతృప్తికరంగా సాగిందన్నాడు. పిచ్ స్లోగా ఉందన్న ఈ కర్ణాటక కుర్రాడు, సెషన్ల వారీగా ఆటను ముందుకు తీసుకెళ్లానని తెలిపాడు. అరంగేట్రం టెస్టు పీడకల లాంటిదని అన్నాడు. ఆ మ్యాచ్ లో రాహుల్ మిడిలార్డర్లో దిగాడు. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్లో పైకి జరగడంతో కొంత వెసులుబాటు దొరికిందన్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా దిగిన రాహుల్ 110 పరుగులు చేయడం తెలిసిందే.