: సునంద హత్యలో నన్నెందుకు ఇరికిస్తున్నారు?: నోరు విప్పిన పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్యలో తననెందుకు ఇరికిస్తున్నారని పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రశ్నించారు. సునంద అనుమానాస్పద స్థితిలో మరణించి ఏడాది దాటిపోయింది. అయితే నిన్నటిదాకా నోరు మెదపని మెహర్ తరార్ నేడు నోరు విప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న తరార్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో మాట్లాడారు. సునంద పుష్కర్ హత్య వ్యవహారంలో తనను అకారణంగా ఇరికిస్తున్నారని ఆమె మండిపడ్డారు. హోటల్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సునంద మృతిపై వాస్తవాలను వెలికితీయాలంటే హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని ఆమె వాదించారు. అసలు దర్యాప్తును వదిలి తన ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ, తాను ఐఎస్ఐ ఏజెంట్ నంటూ వ్యాఖ్యలు చేయడం తప్పని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో హైఫ్రొఫైల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నందున అసలు వాస్తవాలు బయటకు రావడం లేదన్న రీతిలో ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు.