: ఆటలో గెలవకున్నా... రికార్డులు తిరగరాసిన మన క్రికెట్ వీరులు!


ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఇప్పటివరకూ విజయం ఎలా ఉంటుందో చూడని భారత జట్టు ఆటగాళ్ళు పాత రికార్డులను మాత్రం బద్దలు కొడుతున్నారు. నిన్నటివరకూ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి పేరిట ఉన్న రికార్డును కే.ఎల్.రాహుల్ అధిగమించారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా 639 పరుగులతో విరాట్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది. 2003 లో జరిగిన సిరీస్ లో ద్రావిడ్ 619 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బాల్స్ ఆడిన ఆటగాడిగా 23 ఏళ్ల క్రితం రవిశాస్త్రి నెలకొల్పిన రికార్డును (250 బంతులు) నేడు కే.ఎల్.రాహుల్ (262 బంతులు) దాటేశాడు. అంతే కాదు, మెల్బోర్న్ లో జరిగిన మూడో టెస్ట్ లో అత్యంత జిడ్డు ప్రదర్శన కనబరిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ సిరీస్ లో ఓవర్ కు కేవలం 2.63 రన్స్ సాధించిన 'ఘనత' మనదే! వీటితోపాటు ఒక సిరీస్ లో నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్ లో జట్టు కెప్టెన్ లు అత్యధిక సెంచరీలు (7) చేసిన సిరీస్ కూడా ఇదే. కాగా, నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News