: పైలెట్లకు డ్యూటీ వేయడం మరచిన ఎయిర్ ఇండియా... తడిసి మోపెడైన ఖర్చు!
లండన్ హీత్రూ విమానాశ్రయంలో ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం సిద్ధంగా ఉంది. ప్రయాణికులు సైతం ఎక్కి కూర్చునేందుకు రెడీగా ఉన్నారు. విమాన సర్వీసు నిర్వహిస్తున్న ఎయిర్ ఇండియా అధికారులకు మాత్రం ఒక విమానాన్ని సమయానికి నడిపే ధ్యాస లేదేమో! ఆ విమానానికి పైలెట్లను ప్రకటించలేదు. దీంతో, ప్రయాణికులందరికీ 12 గంటల పాటు వసతి సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. అందుకోసం ఎయిర్ ఇండియా భారీగానే చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి అధికారులు ఉంటే, సంస్థకు నష్టాలు రావా మరి! మంగళవారం తెల్లవారుఝామున 2:30 గంటలకు ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన విమానం సాయంత్రం 6:30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. ఆ వెంటనే మరో గంటలో తిరిగి బయలుదేరాల్సిన విమానానికి పైలెట్లను సిద్ధంగా ఉంచడంలో ఎయిర్ ఇండియా విఫలమైంది. విమానంతో వచ్చిన పైలెట్లకు 12 గంటల తప్పనిసరి విశ్రాంతిని ఇవాల్సి రావడంతో, వారితోపాటు ప్రయాణికులందరినీ హోటల్స్ కు తరలించారు. విమానం తిరిగి నిన్న ఉదయం బయలుదేరింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏఐ అధికారి ఒకరు తెలిపారు.