: సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం... పార్టీకి సంబంధం లేదు: అమిత్ షా
హిందువుల జనాభా పెరుగుదల కోసమంటూ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమిత్ షా పలు కీలక అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా సమాధానం చెప్పారు. దేశంలో మత మార్పిడుల నియంత్రణకు సంబంధించి బలమైన చట్టం అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. గడచిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయని చెప్పిన ఆయన, ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కాలం చెల్లిన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో పాటు దాని స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకొచ్చామన్నారు. జన్ ధన్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. తమ పార్టీ చేపట్టిన ఆన్ లైన్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందన్నారు.