: ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది: బాలకృష్ణ


అనంతపురం జిల్లాలో నిన్న పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైన దారుణ ఘటనలో గాయపడి, హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా, ఒక్కొక్కరిని పలుకరిస్తూ, ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. సంక్రాంతి పండుగ ముందు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వైద్యులు మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని చెప్పారు. బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 13 మందిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అపాయం లేని 31 మంది క్షతగాత్రులు హిందూపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News