: అవకాశాలను అందిపుచ్చుకోవట్లేదు: తెలంగాణ కోర్ కమిటీపై అమిత్ షా ఫైర్!
కొత్త రాష్ట్రం తెలంగాణలో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన అమిత్ షా కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో తెలంగాణ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో నేతలు విఫలమవుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక పార్టీ సభ్యత్వ నమోదును కూడా ఆశించినమేర పూర్తి చేయలేకపోయారని కూడా ఆయన నేతలపై మండిపడ్డారట. తెలంగాణ కోసం పోరు సాగించినా, ఎన్నికల్లో ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయారని నేతలను అమిత్ షా నిలదీసినంత పని చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు దిశానిర్దేశం చేస్తారని భావిస్తే, ఫలితాలే లేవంటూ తమనే నిలదీయడంతో కోర్ కమిటీ సభ్యులు కంగుతిన్నారట.