: సింగరేణిలో రెండు కోట్ల మేర టోపీ... లబోదిబోమంటున్న స్ధానికులు
కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కాలరీస్ రిటైర్డ్ ఉద్యోగి రెండు కోట్ల రూపాయల మేర స్థానికులకు కుచ్చుటోపీ పెట్టాడు. సింగరేణి జీడీకే-10 గనిలో వెల్డర్ గా 30 ఏళ్ల పాటు పని చేసిన రామచంద్రయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి, చాలా కాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలా కాలం నుంచి నమ్మకంగా ఉండడంతో సుమారు 300 మంది ఉద్యోగులు, చిరు వ్యాపారులు, చేతి పని వారు అతని వద్ద చిట్టీలు వేశారు. వారందరి నుంచి డబ్బులు వసూలు చేసిన రామచంద్రయ్య గత నెల నుంచి కనిపించడం లేదు. దీంతో అతనికి ఫోన్ చేయగా, స్వగ్రామమైన కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామానికి వెళ్లానని, చిట్టీ పాట నాటికి వచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మౌనం వహించిన చిట్టీల బాధితులు, చిట్టీ టైంకి అతను రాకపోవడంతో మరోసారి ఫోన్ చేశారు. అయితే, అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో, అనుమానం వచ్చి అతని ఇంటి కిటికీలోంచి లోపలికి పరిశీలించగా, అందులో సామాన్లు లేవు. దీంతో తమను ముంచేశాడని అర్థం చేసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, రామచంద్రయ్య గురించి ఆరా తీస్తున్నారు.