: ఫొటోగ్రఫీ హాబీ తనకు ఆక్సిజన్ అంటున్న ఉద్ధవ్ థాకరే
నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేలో కళాత్మకమైన ఫొటోగ్రాఫర్ కూడా దాగున్నాడు. వైల్డ్ లైఫ్ కు సంబంధించి ఆయన తీసిన ఫొటోలను ఓ ఎగ్జిబిషన్ లో తాజాగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు, సంగీత దర్శకులు హాజరయ్యారు. తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ మరాఠీ నటుడు సచిన్ పిలగావ్కర్ కూడా ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే మీకు మీ హాబీపై దృష్టి పెట్టే సమయం దొరికిందా? అని ఈ సందర్భంగా థాకరేను ప్రశ్నించగా, "ఫొటోగ్రఫీ నా హాబీ. నాకు ఆక్సిజన్ వంటిది. నాకు సమయం లేదని అనడం చాలా తప్పు" అని పేర్కొన్నారు. ఆయన చిత్రాల్లో భారతదేశం, మహారాష్ట్ర, కళ పట్ల ప్రేమను ప్రతిబింబిస్తాయని ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. రాజకీయాలు, అభిరుచి పట్ల ఆయన సమతుల్యత పాటిస్తారని అన్నారు.