: బీజేపీతో మా మైత్రికి ఒమర్ అడ్డుపడుతున్నారు: పీడీపీ
జమ్మూ కాశ్మీర్ లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న జాప్యానికి సరికొత్త కారణాన్ని కనుగొంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీతో తమకు కుదరనున్న పొత్తుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గండికొడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ట్విట్టర్ తో తమ పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అఖ్తర్ ఆరోపించారు. ‘‘సుదీర్ఘ కాలం పాటు సీఎంగా కొనసాగిన ఒమర్ పరిపక్వతతో కూడిన రాజకీయాలు చేస్తారని అందరూ భావిస్తారు. అయితే ఒమర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఏమాత్రం పరిపక్వత ప్రదర్శించడం లేదు. ప్రజా తీర్పును శిరసావహించి ప్రజలకు మేలు చేద్దామన్న తమ యత్నాలను ఒమర్ నిష్ఫలం చేస్తున్నారు’’ అని ఒమర్ పై అఖ్తర్ విమర్శలు గుప్పించారు. కేవలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో 2008లో అరగంట వ్యవధిలో కాంగ్రెస్ తో ఒమర్ పొత్తు కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.