: అక్రమ నిర్మాణాలు అనేవి అత్యాచారం, హత్యతో సమానం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ కట్టడాలు... అత్యాచారం, హత్యతో సమానమంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే వ్యాఖ్యానించారు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకుంటూ వెళ్లే పరిస్థితుల్లో, దేశంలో అత్యాచారాలు, హత్యలను కూడా సరైనవేనని చెప్పాల్సి వస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. చెన్నైలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఓ బహుళ అంతస్తుల భవనం క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసును విచారించిన సందర్భంగా జస్టిస్ దవే ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సదరు భవనాన్ని కూల్చివేయాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ భవన యజమాని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ దవే, పిటిషనర్ కు ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా తక్షణమే భవనాన్ని కూల్చివేయాలని తీర్పు చెప్పారు.