: ఢిల్లీపై భద్రతాధికారుల డేగకన్ను... ఒబామా పర్యటనకు భద్రతా వ్యూహాలు సిద్ధం!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్ల ప్రణాళికల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. అమెరికా నుంచి వచ్చిన భద్రతాధికారులతో ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. వీరితో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కూడా ఈ వ్యూహరచనలో పాలుపంచుకుంటున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారత పర్యటనలో భాగంగా ఒబామా ఢిల్లీలోని మౌర్యా షెరటాన్ హోటల్లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు దఫాలుగా హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అమెరికా భద్రతాధికారులు అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఈ నెల 20 నుంచే హోటల్ ను అమెరికా భద్రతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఈ దఫా ఒబామా విమానం దాకా ఆయన భద్రతాధికారుల వాహనాలను అనుమతించనున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద రెండు గంటలకు పైగా ఒబామా బహిరంగ ప్రదేశంలో గడపనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఢిల్లీ జిల్లా పరిధి దాటి రెండు కిలో మీటర్ల మేర పోలీసులు గట్టి నిఘా పెట్టనున్నారు.