: యువీ లేకుండానే సాధించేస్తారా?...సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు వరల్డ్ కప్ జట్టులో మొండి చెయ్యి చూపడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దేశవాళీలో తనను తాను నిరూపించుకున్నా, ఆసీస్, కివీస్ పిచ్ లపై అనుభవమున్నా యువీని పక్కన పెట్టడాన్ని సగటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయంతో బాధపడుతున్న జడేజాపై ఉంచిన నమ్మకాన్ని యువీపై ఉంచకపోవడాన్ని అభిమానులు దుయ్యబడుతున్నారు. గత వరల్డ్ కప్ లో యువీ చేసిన పరుగులను, చూపిన నిలకడను బీసీసీఐ మర్చిపోయిందని, దేశవాళీలో చేస్తున్న పరుగులను కూడా చూడలేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. యువీ లేని వరల్డ్ కప్ జట్టును ఊహించలేకపోతున్నామని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. భారత జట్టు ఎంపిక బాగాలేదని, ఆస్ట్రేలియా పిచ్ లపై బ్యాట్స్ మన్, బౌలర్లు తేలిపోతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యువీ అనుభవం, మ్యాచ్ ను మలుపుతిప్పగల బౌలింగ్ సామర్థ్యం టీమిండియాకు లాభించేవని అందరూ పేర్కొంటున్నారు. యువజట్టు అంటూ అంతా జపం చేస్తున్నారని, కీలకమైన వరల్డ్ కప్ లో, విదేశీ గడ్డపై ప్రయోగాలు అవసరమా? అంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. జట్టులో ధోనీకి ఎదురు రాగల క్రికెటర్ లేరని, యువీ ఉంటే అతనికి ఇబ్బంది ఎదురవుతుందని భావించి, కెప్టెన్ జడేజా వైపు మొగ్గుచూపాడని మరింత మంది ఆరోపిస్తున్నారు.