: వాడి వేడిగా సాగుతున్న సెలక్షన్ కమిటీ సమావేశం... యువరాజ్ ఎంపిక కష్టమే!
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కార్యక్రమం ముంబైలో వాడి వేడిగా సాగుతోంది. తుది జట్టు ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చేస్తున్న తీవ్ర కసరత్తు మరికాసేపట్లో ముగుస్తుందని సమాచారం. దేశవాళీ పోటీల్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన యువరాజ్ సింగ్ జట్టుకు ఎంపిక అవుతాడా? లేదా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అటు, రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపైనా సందీప్ పాటిల్ కమిటీ ఆలోచనలు చేస్తోంది. కాగా, వరల్డ్ కప్ తుది జట్టు ఎంపికపై వీడియో కాన్ఫరెన్స్ లో సెలక్షన్ కమిటీతో ధోనీ మాట్లాడినట్టు తెలుస్తోంది. జడేజా జట్టులో ఉండాల్సిందేనని ధోనీ పట్టుబట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో యువరాజ్ ఎంపికపై ధోనీ పెద్దగా ఆసక్తి చూపలేదట. ఓపెనర్ మురళీ విజయ్ ఎంపికపై కూడా చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లో వరల్డ్కప్ తుది జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.