: తొలి రోజు ఆటలో తుస్సుమన్నారు!
సిడ్నీ టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. టీమిండియా బౌలర్ల పసలేని బౌలింగ్ ను తుత్తునియలు చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్సులో భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. టాపార్డర్ రాణింపుతో తొలి రోజు ఆట చివరికి 2 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (101) సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ క్రిస్ రోజర్స్ 95 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాట్సన్ (61), కెప్టెన్ స్మిత్ (82) కూడా బ్యాట్లు ఝుళిపించారు. దీంతో, ఆసీస్ 300 మార్కు దాటింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమి, అశ్విన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటింగ్ దూకుడు కారణంగా కోహ్లీ సేన తొలి రోజే మ్యాచ్ పై పట్టు కోల్పోయిందన్నది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అంతకుముందు, ఆతిథ్య ఆస్ట్రేలియా టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వార్నర్, రోజర్స్ ధాటిగా ఆడడంతో భారత బౌలర్లు తేలిపోయారు. ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి జట్టు స్కోరు 200 పరుగుల వద్ద వార్నర్ వెనుదిరగడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. వార్నర్ ను అశ్విన్ అవుట్ చేశాడు. మరో నాలుగు పరుగులకే రోజర్స్ కూడా వెనుదిరగడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత శిబిరంలో కొంత ఉత్సాహం కనిపించినా, అది కాసేపే అయింది. బరిలో దిగిన వాట్సన్, స్మిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. తొలుత ఆచితూచి బంతులను ఎదుర్కొన్న వీరిద్దరూ, క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించారు. ఈ క్రమంలో అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. కాగా, ఫిట్ నెస్ నిరూపించుకుని తుది జట్టులోకి వచ్చిన యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మూడు టెస్టుల్లో ఓ మోస్తరుగా రాణించిన ఉమేశ్ యాదవ్ మొదటి రోజు ఆటలో భారీగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో, కెప్టెన్ కోహ్లీ అతడిని కొన్ని ఓవర్ల అనంతరం ఫీల్డింగ్ కే పరిమితం చేయాల్సి వచ్చింది. ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పార్ట్ టైమర్ రైనా కూడా బౌలింగ్ చేశాడు. వికెట్లు తీయకున్నా పొదుపరితనం కనబర్చాడు.