: పదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన పంజాబ్ మాజీ సీఎం హంతకుడు!


పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో కీలక నేరస్తుడు జగ్తార్ సింగ్ అలియాస్ తారా పోలీసులకు చిక్కాడు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ అండతో థాయ్ లాండ్ లో తలదాచుకున్న తారాను అక్కడి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. కాగా, 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్ లో బియాంత్ సింగ్ దారుణ హత్యకు గురికాగా, ఈ ఘాతుకం ఖలిస్థాన్ వేర్పాటువాదుల పనే అని దర్యాప్తులో తేలింది. ఆ తరువాత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ తారాను, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చంఢీఘడ్ లోని బురైల్ జైలుకు తరలించారు. అయితే, 2004లో ఆ జైలుకు సొరంగం తవ్వి దాని ద్వారా హంతకులంతా పారిపోయిన ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. ఇద్దరు నేరస్తులను నేపాల్ లో అరెస్ట్ చేసిన పోలీసులు... తారా, మరో నిందితుడు దేవ్ సింగ్ లు పాకిస్థాన్ కు పారిపోయారని తేల్చారు. కొంతకాలం క్రితం తారా థాయ్ లాండ్ వెళ్లినట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ దేశ ప్రభుత్వ సహకారంతో ఎట్టకేలకు మళ్ళీ అరెస్ట్ చేయగలిగారు. మరో నేరస్తుడు దేవ్ సింగ్ ఇంకా పాక్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News