: తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమే: ఏపీ మంత్రి గంటా
తెలంగాణ ప్రాంతం కూడా దేశంలో అంతర్భాగమేనన్న విషయాన్ని ఆ రాష్ట్ర సర్కారు గుర్తించాలని ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం ఎంసెట్ వివాదంపై సామరస్యపూర్వక ధోరణిని అవలంబించాలని ఆయన కోరారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఎంసెట్ వివాదంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో గంటా భేటీ అయ్యారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ సర్కారు మొండి వైఖరి విడనాడటం లేదని ఆయన వెంకయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంటా, తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ... కేంద్రం నిర్ణయాలు, న్యాయస్థానాలు, చట్టాలను గౌరవించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.