: యువీకి జట్టులో చోటు దక్కేనా?... నేడు వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఎంపిక
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందిగా? శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో ధనాధన్ ధోనీతో కలసి యువరాజ్ సింగ్ తన అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి, భారత జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. తాజా వరల్డ్ కప్ లోనూ యువీ ఆడతాడా? గడచిన వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ నేటితో వీడిపోనుంది. ప్రపంచ కప్ కు భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ నేడు ఎంపిక చేయనుంది. చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో ముంబైలో భేటీ కానున్న సెలెక్షన్ కమిటీ నేడు టీమిండియా జట్టును ఎంపిక చేయనుంది. ఆల్ రౌండర్ కోటాలో జట్టులో చోటు పదిలం చేసుకున్న రవీంద్ర జడేజా గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి దాదాపుగా వైదొలగినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో గత వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కు అవకాశం లభించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రంజీల్లో సత్తా చాటిన యువీపై సెలెక్షన్ కమిటీ కూడా ఆసక్తి చూపుతోంది. అంతేకాక వరల్డ్ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో యువీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా జట్టుకు లాభిస్తుందన్న వాదన కూడా ఉంది. అయితే యువ నామస్మరణ చేస్తున్న సెలెక్షన్ కమిటీ జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే యూవీవైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.