: రేప్ లకు ప్రభుత్వం బాధ్యత వహించదంటున్న యూపీ మహిళా మంత్రి
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. కాన్పూర్ లో ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అరుణా కోరి మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు జరిగితే వాటికి ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. అత్యాచారాలకు సమాజమే బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఆమె తెలిపారు. నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తున్నామని ఆమె చెప్పారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై విమర్శల జడివాన కురిసింది. కాగా, మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో... ప్రభుత్వం చేతకానితనాన్ని ఇలా వెల్లడించిందని పలు మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.