: 'లయన్' సినిమా షూటింగ్ స్పాట్ లో కిడ్నాప్ కలకలం


నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయన్' సినిమా షూటింగు స్పాట్ లో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ హయత్ నగర్, రామోజీ ఫిలింసిటీ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ షూటింగ్ స్పాట్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ ను కొంతమంది దుండగులు అపహరించారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... నిర్మాణ సంస్థ ఎస్ఎల్ వీ కంపెనీ ఈ సినిమా షూటింగు కోసం ఫనా ట్రావెల్స్ కు చెందిన కార్లను అద్దెకు తీసుకుంది. అవి కొన్నాళ్ల కిందట రిపేర్ కు రావడంతో వాటికి మరమ్మతులు చేయించి ఇవ్వాలని, దాంతోపాటు అద్దె చెల్లించాలని ఫనా ట్రావెల్స్ వారు గొడవ చేస్తున్నారు. ఇటు షూటింగ్ కోసం వేరే కంపెనీ కార్లను నిర్మాణ సంస్థ వాడుతోంది. దాంతో ఫనా ట్రావెల్స్ కు చెందిన అక్బర్, ఇమ్రాన్ ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ ఖాన్, మరో ఇద్దరు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్ సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా మరో ట్రావెల్స్ కు చెందిన డ్రైవర్ మహేష్ ను కొట్టి అతని కారు కూడా పట్టుకెళ్లారు. ఈ సమయంలో క్యాషియర్ ను తీసుకెళుతున్న కారు హయత్ నగర్ రహదారిలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో, క్యాషియర్ కారు నుంచి దిగిపోయాడు. అటు, ట్రావెల్స్ డ్రైవర్ మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. చివరికి దుండగుల కారును వనస్థలిపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News