: కార్మిక శాఖ కమిషనర్ తో చర్చలు విఫలం... ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్!
పండుగ సీజన్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించడం తెలిసిందే. ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇస్తుంటారు. అప్పటికి సమస్యను ఏదోలా పరిష్కరించి చేతులు దులుపుకునే ఆర్టీసీ యాజమాన్యానికి ఈ ఏడాది కూడా సంక్రాంతి ముంగిట సమ్మె నోటీసులు ఎదురయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక శాఖ కలిసి కార్మికులతో చర్చలు జరిపాయి. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల డిమాండ్లకు తలొగ్గకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో, రేపు మరోసారి యాజమాన్యంతో సమావేశమై చర్చలు జరుపుతామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మె తేదీలు ప్రకటిస్తామని ఈయూ పేర్కొంది.