: పవన్, చిరు బాటలో తమిళ హీరో విజయ్
ఇటీవల మెగా సోదరులు పవన్ కల్యాణ్, చిరంజీవి తమను చూడాలనుకుంటున్న అనారోగ్య పీడిత చిన్నారులను కలిసి వారిని సంతోషం పెట్టడం తెలిసిందే. పవన్ ఖమ్మంలో శ్రీజ అనే బాలికను కలిసి ఆమెతో కాసేపు గడిపాడు. ఆ చిన్నారికి బొమ్మలు ఇచ్చి, ఆమెతో ఫొటోలు కూడా తీయించుకున్నాడు. చిరంజీవి హైదరాబాదు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు అనే చిన్నారిని పరామర్శించాడు. ఇప్పుడు వీరి బాటలో తమిళ హీరో విజయ్ కూడా వీల్ చైర్ కు పరిమితమైన అర్చన అనే బాలికను పరామర్శించి సంతోషపెట్టాడు. అర్చన గత ఐదేళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తనకు హీరో విజయ్ ను చూడాలని ఉందని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ విషయం విజయ్ కు తెలియడంతో ఆయన పెద్ద మనసుతో చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న అర్చన ఇంటికి వచ్చారు. తనకిష్టమైన హీరో తన ఇంటికి రావడంతో ఆ బాలిక ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. విజయ్ సరసన ఫొటోలు తీయించుకుని మురిసిపోయింది. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే తరహాలో తమను చూడాలని ఉందన్న చిన్నారులను కలిసి ఆనందంలో ముంచెత్తారు.