: కేసీఆర్ సాబ్, తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది... గమనించండి: అసదుద్దీన్
హిందూ రాజ్య స్థాపనలో భాగంగా తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మిషన్-7స్టేట్స్ పేరుతో తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను టీఎస్ ముఖ్యమంత్రి గమనించాలని... ఈ కోణంలోనే 2019 ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణకు బీజేపీ, సంఘ్ పరివార్ నేతల రాకపోకలు ఎక్కువయ్యాయని అసద్ అన్నారు. 2020 నాటికి హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారని... దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని హిందూ రాజ్యంగా మారనివ్వమని స్పష్టం చేశారు. భారత్ లో ఉన్న ముస్లింలంతా భారతీయులేనని... తాము ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లమని అసద్ అన్నారు. ఇండియాకు శత్రువులైన వారంతా ఇక్కడి ముస్లింలకు కూడా శత్రువులేనని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి తామంతా సిద్ధమని చెప్పారు. సంఘ్ పరివార్ కుట్రలను రాజకీయంగా అడ్డుకుంటామని తెలిపారు.