: సిడ్నీ హార్బర్లో టీమిండియా జలవిహారం
ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్లో టీమిండియా సేదదీరింది. ఆస్ట్రేలియాలో భారత్ హైకమిషన్ క్రికెటర్ల జల విహారానికి ఏర్పాట్లు చేసింది. ఓ క్రూయిజ్ లైనర్ లో టీమిండియా క్రికెటర్లు సిడ్నీ సముద్ర జలాల్లో గంటన్నర సేపు విహరించారు. వీరికి భారత హైకమిషనర్ బీరేన్ నందా స్వాగతం పలికారు. ఆటగాళ్లకు విందు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా హైకమిషనర్ మాట్లాడుతూ, సిరీస్ లో భారత జట్టు పోరాట పటిమను కనబర్చడాన్ని ప్రస్తుతించారు. వరల్డ్ కప్ వరకు ఇదే పంథా కొనసాగించాలని ఆకాంక్షించారు. భారత్ హైకమిషన్ ఆతిథ్యంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. సాగరజలాల్లో అద్భుతరీతిలో ఆతిథ్యమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఆయా దేశాల్లో హైకమిషన్ లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఇది భిన్నంగా ఉందని పేర్కొన్నాడు. ఇక, ఉపన్యాసాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఆటగాళ్లకు ఆ క్రూయిజ్ లైనర్ పైనే విందు ఏర్పాటు చేశారు. అనంతరం, ఆ విలాసవంతమైన నౌక హార్బర్ చేరుకోగా, ఆటగాళ్లు హోటల్ కు పయనమయ్యారు.