: ఒబామా పర్యటనకు ముందు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులకు యత్నం?


భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఆర్నియాలో జరిగిన దాడుల తరహాలో ఆత్మాహుతి దాడులకు ఉగ్రమూకలు పథకాలు రచిస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సహకారంతో దాడులకు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు గుజరాత్ తీరం మీదుగా భారత్ చేరేందుకు యత్నించారని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. పాక్ లోని పంజాబ్ రాష్ట్ర పరిధికి చెందిన సియాల్ కోట్ నుంచి ఉగ్రవాదులు బయలుదేరారని తెలుస్తోంది. అయితే సియాల్ కోట్ తరహాలోనే ఆ రాష్ట్రంలో మరో ఆరు ప్రాంతాలు ఉగ్రవాదులకు తీరం దాటేందుకు అనుకూలంగా ఉన్నాయని కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నదులను దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఫ్లోరేట్ అనే కొత్త తరహా పరికరాలను వాడినట్లు కూడా ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే దట్టమైన పొగమంచు, భారత కోస్ట్ గార్డ్ నుంచి ప్రతిఘటన నేపథ్యంలో వారి యత్నాలు ఫలించలేదని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News