: అదృష్టమంటే అతనిదే... కోటీశ్వరుడైన వడా పావ్ వ్యాపారి!
ముంబైలో రోజుకు రూ.150 మాత్రమే సంపాదించే వ్యాపారి ప్రేమ్ తేజుమాల్ గురుదాసాని. అతని దారిద్ర్యాన్ని భరించలేక మూడేళ్ళ క్రితం ఇద్దరు పిల్లలను వదలి భార్య కూడా వెళ్ళిపోయింది. కేవలం 165 చదరపు అడుగుల విస్తీర్ణమున్న గదిలో సోదరుడి కుటుంబంతో కలసి కాలం గడిపే ప్రేమ్ ను అదృష్టం పలకరించింది. అంతా కలిసొస్తే త్వరలోనే సుమారు రూ.7 కోట్ల విలువైన ఆస్తికి అతను హక్కుదారుడు అవుతాడు. అసలు విషయం ఏమిటంటే... ఇండియా, పాకిస్తాన్ విడిపోయిన తరువాత ఉద్యోగిగా ఉన్న ప్రేమ్ తాత రాధోమల్ మిన్హోమల్ చిచారియా అలియాస్ గురుదాసానిని పాక్ అధికారులు ఇండియాకు పంపారు. ఆయనకు ముంబైలోని ఉల్లాస్ నగర్ పరిధిలో 9.5 ఎకరాల విస్తీర్ణమున్న రెండు ప్లాట్ లను ఇచ్చి ప్రభుత్వం పునరావాసాన్ని కల్పించింది. ఆయన చనిపోయిన తరువాత రంగంలోకి దిగిన ముంబై మాఫియా, ఓ మహిళను ఆయన భార్యగా చూపించి ఆ స్థలాన్ని విక్రయించింది. ఇటీవలే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రేమ్, సహకార చట్టాన్ని వినియోగించి పలు ప్రభుత్వ విభాగాల నుంచి తన తాతకు సంబంధించిన స్థలంపై సాక్ష్యాలు సేకరించి పోలీసు కేసు పెట్టాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మాఫియా ముఠాలోని మనోజ్ చిచారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆస్తికి ప్రస్తుతం ప్రేమ్ సోదరితో పాటు మరో ఇద్దరు పినతండ్రి కుమారులు వారసులుగా ఉన్నారు. ఈ 9.5 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ.35 కోట్లుగా ఉండగా, తన వాటా కింద రూ.7 కోట్లు వస్తుందని ప్రేమ్ సంబరపడుతున్నాడు.