: సిడ్నీ టెస్టులో 'కోహ్లీ వర్సెస్ జాన్సన్' ఎపిసోడ్ ఉండదు!
సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టుకు ముందు ఆసీస్ తురుపుముక్క మిచెల్ జాన్సన్ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ప్రాక్టీసుకు దూరమైన జాన్సన్ ను సెలక్టర్లు సిడ్నీ టెస్టుకు ఎంపిక చేయలేదు. దీంతో, కోహ్లీతో ఈ లెఫ్టార్మ్ స్పీడ్ స్టర్ 'స్లెడ్జింగ్' ఎపిసోడ్ సిడ్నీలో కనిపించదు. సిరీస్ లో తొలి టెస్టు నుంచి కోహ్లీతో జాన్సన్ మాటల యుద్ధం సాగిస్తున్న సంగతి తెలిసిందే. జాన్సన్ దాడులకు ఈ టీమిండియా స్టార్ దీటుగా బదులిస్తూ, అదే సమయంలో భారీగా పరుగులు సాధిస్తూ సవాల్ విసరడం విశేషం. కాగా, జాన్సన్ స్థానంలో మిచెల్ స్టార్క్ గానీ, పీటర్ సిడిల్ గానీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై కంగారూ టీమ్ కోచ్ డారెన్ లేమన్ మాట్లాడుతూ, జట్టు వ్యూహాల్లో జాన్సన్ ముఖ్య భాగమని అన్నాడు. అతను వరల్డ్ కప్ కు వందశాతం నూతనోత్తేజంతో సిద్ధమయ్యేందుకు వీలుగా ఎలాంటి రిస్కు తీసుకోదలుచుకోలేదని స్పష్టం చేశాడు. జాన్సన్ ఈ విశ్రాంతిని వినియోగించుకుని ముక్కోణపు సిరీస్ నాటికి ఫిట్ గా తయారవుతాడని భావిస్తున్నట్టు తెలిపాడు.